పోలీసులకు క్వార్టర్స్​ నిర్మిస్తం..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 

పోలీసులకు క్వార్టర్స్​ నిర్మిస్తం..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు ఉందని, సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించడంలో దేశంలో అగ్రస్థానంలో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవిస్తున్నామనే భరోసాతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్​ శాఖదేనన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నివాసాలకు క్వార్టర్స్ నిర్మిస్తామని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోలీస్ క్వార్టర్స్ నిర్మాణానికి అవకాశం ఉందో  ప్రతిపాదనలు పంపించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.

సెక్రటేరియెట్​లో శనివారం హోం శాఖ ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని పలు అంశాలపై  చర్చించారు. ఉపాధి అవకాశాల నేపథ్యంలో హైదరాబాద్ కు వలసలు పెరుగుతున్నాయని, ఆ మేరకు భద్రత కల్పించడానికి హోం శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూడు నగరాలకు తోడు నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ రెడీ అవుతున్నదని, ఇంకా మెరుగ్గా పనిచేయాలన్నారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, పోలీస్ శాఖ బలోపేతానికి వాటిని వాడుకోవాలన్నారు.

ఏడాదిగా పోలీస్ శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు, ప్రస్తుత ఖాళీలపై సమీక్షించారు. గ్రేహౌండ్స్, నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్ మెన్  విభాగాల ఉన్నతాధికారులు వారి బడ్జెట్ అవసరాలపై సమావేశంలో నివేదిక సమర్పించారు. ఫైనాన్స్​స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పాల్గొన్నారు.