వచ్చే ఏడాది నుంచి రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తం : భట్టి విక్రమార్క

వచ్చే ఏడాది నుంచి రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తం : భట్టి విక్రమార్క
  • సేంద్రియ సాగుపై రైతులు ఫోకస్ చేయాలి
  • ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహకరిస్తది
  • పంపుసెట్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తం
  • మిగులు కరెంట్​ను ప్రభుత్వమే కొంటదని వెల్లడి

మధిర, వెలుగు: భూమిలేని రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచలో రెండో విడత దళిత బంధు లబ్ధిదారులైన 847 కుటుంబాలకు రూ.15.54 కోట్ల మంజూరి పత్రాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నం.

ప్రజల డిమాండ్​కు అనుగుణంగా సేంద్రియ సాగు వైపు రైతులు దృష్టి సారించాలి. ఈ తరహా సాగులో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి పెద్దపీట వేస్తాం. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహకరిస్తది. డైరెక్ట్​గా రైతులతో ఒప్పందం చేసుకునేలా చొరవ తీస్కుంటాం’’అని భట్టి అన్నారు. మధిర నియోజకవర్గం సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. పంపు సెట్ల వినియోగానికి పోగా మిగిలిన సోలార్ పవర్​ను ప్రభుత్వం కొనుగోలు చేస్తదని చెప్పారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వాములను చేస్తామని భట్టి అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఏడాది రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునేలా పనిచేస్తున్నానని అన్నారు. ‘‘ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం అంకితభావంతో పని చేస్తున్న. చింతకాని మండలంలో దళిత బంధు పథకం కింద 3,462 కుటుంబాలను ఎంపిక చేశాం. వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలి’’అని తెలిపారు.