- టూరిజం డెవలప్మెంట్కు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తం
- ఎకో, టెంపుల్ టూరిజానికిఎన్నో అవకాశాలున్నాయని వ్యాఖ్య
- నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతది
ఖమ్మం/నేలకొండపల్లి, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌వే ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ఖమ్మం ఖిల్లాను సోమవారం ఆయన సందర్శించారు. అంతకుముందు ముజ్జుగూడెంలోని బౌద్ధ స్తూపాన్ని మంత్రి పొంగులేటితో కలిసి పరిశీలించారు.
అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. ‘‘నెలకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని జూపల్లి సూచించడం బాగుంది. ఖమ్మం జిల్లాలో ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి చాలా అవకాశాలున్నయ్. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు ఉన్న అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నయ్. నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం నుంచి జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటది. ఖమ్మం ఖిల్లాపై రోప్ వే నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం’’అని భట్టి అన్నారు.
రాష్ట్ర ఆదాయం పెరుగుతది: జూపల్లి
అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా స్టేట్ టూరిజాన్ని డెవలప్ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. టూరిజంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ‘‘మన రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్కు అన్ని వనరులున్నయ్. ఖమ్మం ఖిల్లాపై రోప్ వే నిర్మిస్తం. బెస్ట్ ఎక్స్పర్ట్స్ సహకారంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తం.
జిల్లాలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం, భక్త రామదాసు ధ్యాన మందిరం, పాలేరు, వైరా రిజర్వాయర్ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నయ్. అంతకుముందు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ కలిసి నేలకొండపల్లిలోని భక్తరామదాసు ఇంటిని సందర్శించారు. ఆయన వినియోగించిన బావిని పరిశీలించారు. వీరి వెంట కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.