దుబారా తగ్గిస్తం .. రైతుభరోసా విధివిధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టి

దుబారా తగ్గిస్తం .. రైతుభరోసా విధివిధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టి
  • 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తం
  • ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని వెల్లడి 
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకు పంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు వచ్చే ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా చూస్తామని చెప్పారు.  దుబారా ఖర్చులను తగ్గిస్తా మన్నారు.  ‘‘రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలను రూపొందించేందుకు 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాం” అని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్​లో  రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పెండింగ్​పెట్టిన రైతుబంధు నిధులను విడుదల చేశామన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. రైతుభరోసా పథకం విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ కమిటీకి నేను చైర్మన్​ గా ఉండగా.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. 10 ఉమ్మడి జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. ఆ నివేదికను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం. ఆ తర్వాత రైతుభరోసా విధివిధానాలు రూపొందిస్తాం” అని వెల్లడించారు. 

నిజమైన రైతులకే రైతుభరోసా: తుమ్మల 

నిజమైన రైతులకు రైతుభరోసా అందించడానికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. గతంలో మాదిరి దుబారా లేకుండా చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.‘‘ రైతు భరోసా విధివిధానాలపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దు. అన్ని జిల్లాల్లోనూ రైతుల అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం ఉంటుంది” అని అన్నారు.  

నాలుగ్గోడల మధ్య నిర్ణయాలుండవు: పొంగులేటి

తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయని.. నాలుగ్గోడల మధ్య నిర్ణయాలు ఉండవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని, నాలుగ్గోడల మధ్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలపై రుద్దేవారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్ వి పాటిల్, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావ్ పాల్గొన్నారు.