- సంపద పెంచి పేదలకు పంచుతం
- ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి
- పరిశ్రమలు, సేవా రంగాన్ని ప్రోత్సహిస్తం
- అభివృద్ధి ఫలాలను బడుగు, బలహీనవర్గాలకు చేరవేస్తం
- ప్రజలు ఆత్మగౌరవంతో బతికేదే ఇందిరమ్మ రాజ్యమని వ్యాఖ్య
- ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలకులు కొల్లగొట్టారు: పొంగులేటి
- గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతాం: తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలో ఉన్న వనరులతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘‘ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్, సేవా రంగాన్ని ప్రోత్సహిస్తాం. ఈ రంగాల్లో రాణించలేని దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాలకు ఆ ఫలాలు అందేలా చేసి, వాళ్లంతా ఆత్మగౌరవంతో బతికేలా చూస్తాం. అదే ఇందిరమ్మ రాజ్యం’’ అని అన్నారు. ప్రజలందరికీ ఇండ్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, వృద్ధులకు పెన్షన్లు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇందిరమ్మ రాజ్యంలో ఉంటాయని చెప్పారు.
మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మంత్రులు తొలుత పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఓల్డ్ బస్టాండ్ లో మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ గ్యారంటీలకు వారంటీ లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లకు చెంపపెట్టులా తమ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని భట్టి విక్రమార్క అన్నారు. మిగిలిన గ్యారంటీలను కూడా 100 రోజుల్లోపే అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, రాష్ట్ర సంపదను ప్రజానీకానికి పంచడమే తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు.
ఖజానాలోని డబ్బంతా మామా అల్లుళ్లు
జమ చేసుకున్నారు: పొంగులేటి
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్పాలకులు కొల్లగొట్టారని, అలాంటి వాళ్లు తమ కు నీతులు చెప్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాక ముందే మాజీ మంత్రి హరీశ్‌రావు అప్పుడే 6 గ్యారంటీలపై మమ్మల్ని నిలదీస్తున్నారు. రైతు బంధు సాయం ఎందుకు జమ చేయలేదని అడుగుతున్నారు. ఆయనకు జ్ఞానం ఉందో లేదో అర్థం కావడం లేదు. హరీశ్.. అసలు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉన్నాయా? ఉన్న డబ్బంతా నీ అకౌంట్‌కు, నీ మామ అకౌంట్‌కు జమ చేసుకున్నవ్.. రైతుబంధు ఇవ్వడానికి మీరు 3 నెలల గడు వు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చి 2 రోజులు కాకముందే నిలదీస్తున్నారు. గురువింద గింజ కింద ఉన్న నలుపు చూసుకోవాలి’’ అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా.. తాము ఇచ్చిన గ్యారంటీలను కష్టపడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దోచుకున్న సంపదను రికవరీ చేస్తామని, అలా కూడబెట్టిన డబ్బుతో 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల కాళ్లు కడుగుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సీఎం ఆశీర్వాదం, డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తుమ్మల అన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. అక్రమ కేసులు, భూ కబ్జాలకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.