కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి.. విభజన చట్టంలోని హామీ అమలు చేయాలి: భట్టి

  • కొత్త రైల్వే లైన్లు వేయాలి.. కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడి
  • కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కలిసి ముందుకు వెళ్తున్నది: తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయితే, విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైనంత త్వరగా కేటాయించాలని కోరారు. దీనికి ఎంపీ లక్ష్మణ్ మరింత చొరవ తీసుకోవాలన్నారు. 

గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఫండ్స్ కేటాయించి రైల్వే లైన్​ను మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమృత్ స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. బేగంపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ఎంపీ లక్ష్మణ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘కొత్త రైల్వే లైన్లు వేయాలి. 

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా సహకరిస్తుంది. బేగంపేట రైల్వే స్టేషన్​ను అభివృద్ధి చేయడం సంతోషకరం. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ అండ్​బీ శాఖ ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాల సందర్భంగా అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించడం బాగుంది. గతంలో రైల్వేస్టేషన్లను మాత్రమే డెవలప్ చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు స్టేషన్ల పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం”అని అన్నారు. 

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సర్కార్ పని చేస్తున్నది: గవర్నర్ తమిళిసై

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. కేంద్ర ప్రభు త్వంతో కలిసి ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ‘‘రూ.169 కోట్లతో 17 రోడ్ ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జిలకు మోదీ శంకుస్థాపన చేశారు. రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన 32 రోడ్ ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జిలను ప్రారంభించారు. తెలంగాణకు భారీ ఎత్తున ప్రాజెక్టులు, నిధులు వచ్చాయి. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఎయిర్ పోర్ట్ మాదిరి సౌకర్యాలు కల్పిస్తున్నాం. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయడంవల్లే ఇంత అభివృద్ధి జరుగుతున్నది’’అని గవర్నర్ అన్నారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న మోదీకి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో మోదీ సర్కార్ రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించిందని తెలిపారు. రైల్వే బడ్జెట్​లో రాష్ట్రానికి రూ.4,400 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.750 కోట్లు కేటాయించారని తెలిపారు.