
- ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు చాన్స్
- ఈ పథకానికి దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నాం
- అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ గడువును ఈ నెల 14 వరకు పొడిగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష సమావేశం నిర్వ హించారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 వరకు అప్లికేషన్ల స్వీకరణ గడువు ఉండగా.. వరుస సెలవుల నేపథ్యంలో గడువును 14 వరకు పొడిగించినట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి ఈ పథకానికి దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. గత పదేండ్లలో నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్ష జరుపుతామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు. పథకానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందించాలని ఆదేశించారు.