- కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
- కరెంట్ ఉన్నా.. లేనట్టు తప్పుడు ట్వీట్లు చేశారని ఫైర్
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కరెంట్, నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులంతా అక్కడే ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చని ఆయన సూచించారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి.. విద్యుత్ కోతలపై అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
కరెంట్సప్లై ఉన్నా.. పవర్ కట్ అంటూ జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇండ్లల్లో కూర్చొని తప్పుడు ట్వీట్లు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలను అసహ్యించుకునే రాష్ట్ర ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని భట్టి విమర్శించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హామీలు అమలు చేయలేరని మాట్లాడుతున్నరు. మేము అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు ఫ్రీ బస్ జర్నీ కల్పించాం. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు ఇస్తున్నాం. ఇటీవల జరిగిన పంటనష్టం లెక్కలు తెప్పించుకున్నం. తప్పకుండా పరిహారాన్ని అందిస్తాం. కేసీఆర్ తన పదేండ్లలో ఏనాడైనా పంటనష్ట పరిహారాన్ని అందించారా? ”అని భట్టి ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
అబద్ధాలు, కట్టు కథలతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేండ్లలో దేశ సంపదను మోదీ, రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచేశారని, మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భట్టి కోరారు. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ.. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లా అని, బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధిచెప్పేలా భారీ మెజార్టీతో రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు.