
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ రూ.11,600 కోట్లు మంజూరు చేసిందని.. ఈ మేరకు శనివారం (మార్చి 8) జీవో విడుదల చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవని అన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ALSO READ | BREAKING: SLBC టన్నెల్ రెస్క్యూలో పురోగతి.. టీబీఎమ్ ముందు డెడ్ బాడీ గుర్తింపు..
ఇంటిగ్రేటేడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామని.. ప్రైవేట్లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలన అంటే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. గురుకులాలను కోళ్ల ఫారాలు, పశువుల షెడ్లో నిర్వహించారని ఫైర్ అయ్యారు.
కానీ మేం అధికారంలోకి వచ్చాక పేద పిల్లలకు మంచి విద్యను అందివాలని కార్పొరేట్ స్థాయి వసతులతో ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఆనాటి ప్రభుత్వం రూ.7.19 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి మీద పడుతున్నా.. అవి చెల్లిస్తూనే.. పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత గురుకులాల్లో పిల్లల ఇబ్బందులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు లబ్ధి జరగాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.