రెండు జిల్లాల అభివృద్ధికి ముగ్గురం ఏకమవుతాం! : భట్టి విక్రమార్క

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •      పామాయిల్​ను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్తా : తుమ్మల
  •      వసూళ్లు, కబ్జాలు, పోలీస్​ జులుం లేని ప్రజాపాలన అందిస్తాం : పొంగులేటి  

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సమగ్ర అభివృద్ధికి ముగ్గురు మంత్రులం ఏకమవుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులుగా ప్రమాణం చేశాక తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భట్టితోపాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన వారికి కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్​సెక్రటరీ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన పాల్వంచలోని సుగుణ ఫంక్షన్​ హాల్​లో అభినందన సభ ఏర్పాటు చేశారు.

ముగ్గురు మంత్రులతో పాటు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, రాందాస్​ నాయక్​ను సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్​పై గెలిచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలకు ఈ ప్రాంత ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారన్నారు. రాష్ట్రానికి వెలుగులు అందించే పవర్​ ప్రాజెక్ట్​లతో పాటు ఇందుకు అవసరమైన కోల్​మైన్స్​కొత్తగూడెం నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. ఈ సెగ్మెంట్​ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. 

దిగుమతి కాదు.. ఇక ఎగుమతే.. 

పామాయిల్​ను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఉమ్మడి ఖమ్మం జిల్లాను నిలుపుతామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్​ పాం సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లకు గానూ 9 సీట్లు గెలుచుకొని అగ్రగామిగా ఉందన్నారు. భద్రాచలం సీటును స్వల్ప మెజార్టీతో ఓడిపోయామని, త్వరలోనే దాన్ని కూడా సరిచేసుకుంటామని చెప్పారు. గోదావరి జలాలను ఈ టర్మ్​లోనే అందించేలా కృషి చేస్తానన్నారు. 

కబ్జాదారులకు బుద్ధి చెప్పిన్రు.. 

ఈ ఎన్నికల్లో కబ్జాదారులకు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇక నుంచి వసూళ్లు, కబ్జాలు, పోలీస్​ జులుం లేని ప్రజా పాలనను కాంగ్రెస్​ ప్రభుత్వం అందిస్తుందని పొంగులేటి చెప్పారు. గత ఐదేండ్ల కాలంగా బీఆర్​ఎస్​ హయాంలో పడిన నరక యాతన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మిది సీట్లను కాంగ్రెస్​, మిత్రపక్షాలు గెలుచుకోవడం ఆనందబాష్పాల రూపంలో కొట్టుకుపోయిందన్నారు. అసెంబ్లీ సెషన్స్​తర్వాత ముగ్గురం నియోజకవర్గాల్లో వేర్వేరుగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

వారం రోజులు ఖమ్మం జిల్లాలో ఉంటే ఒక్కరోజైనా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తానే ఇక్కడ నుంచి మొదట పోటీ చేస్తామని అనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా సీపీఐకి ఈ సీటు ఇచ్చామన్నారు. కూనంనేని గెలుస్తారో లేదో, కాంగ్రెస్​ ఓట్లు సీపీఐకి పడతాయో లేదోనని మొదట చాలా భయపడ్డా, కాని కాంగ్రెస్, సీపీఐ నేతలు కలిసి కట్టుగా పనిచేసి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడుతానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి కూనంనేని తీసుకెళ్లారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​, సీపీఐ నేతలు పొదెం వీరయ్య, దుర్గా ప్రసాద్, బాలసాని లక్ష్మీనారాయణ, కొత్వాల శ్రీనివాసరావు, సాబీర్​పాషా, ఆళ్ల మురళి, నాగ సీతారాములు, తూం చౌదరి, చీకటి కార్తీక్​ పాల్గొన్నారు.