
- సీఐఐ సమావేశంలో భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: పెట్టు-బడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యూరోపియన్ యూనియన్ బృందం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో తెలంగాణ ప్రతినిధిగా భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ వాణిజ్య అభివృద్ధిలో తెలంగాణ పాత్రను, పెట్టు-బడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై ఒక క్లీన్ అండ్ గ్రీన్ పాలసీని ప్రారంభించామని చెప్పారు. ప్రపంచం మొత్తం గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తున్నందున తాము సమగ్ర గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించామన్నారు. ఈ విధానానికి పరిశ్రమలు, డేటా సెంటర్లు, వినియోగదారుల నుంచి ప్రశంసలు అందాయని తెలిపారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తమ ప్రభుత్వం కట్టు-బడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణను సందర్శించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ బృందాన్ని భట్టి కోరారు.