- గత పాలనలో సంపద నాశనం
- భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి.. ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు
- మేం 6 గ్యారెంటీలు అమలు చేస్తం
- ఇందిరమ్మ ఇండ్లు కట్టించి తీరుతం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం: గత పాలనలో తెలంగాణ సంపద సర్వనాశనం అయ్యిందని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన గత సర్కారుకే దక్కుతుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలె మండలం బనిగండ్లపాడు గ్రామంలో ఇవాళ డిప్యూటీ సీఎం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులు మారుతాయని ప్రజలు కలలు కన్నారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అని నమ్మబలికిన బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను నెరవేర్చుతుందని భరోసా ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న అధిగమిస్తామని, సంపద సృష్టించి రాష్ట్రం రూపు రేఖలు మార్చుతామని అన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అసెంబ్లీలో శ్వేత పత్ర విడుదల చేసి ఆర్థిక పరిస్థితులను చెప్పామన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కావలసిన బడ్జెట్ ప్రిపరేషన్ కోసమే ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామని చెప్పారు.
ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రజాస్వామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. మానవ వనరుల పై పెట్టుబడి పెట్టాలని ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.