- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కామెంట్స్
- రూ.45 వేల కోట్లతో నాలుగు స్కీమ్స్
- అమలు చేస్తున్నట్లు వెల్లడిఖమ్మం జిల్లాలో వేర్వేరుగా స్కీములను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి
ఖమ్మం, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తదితర స్కీమ్ ల అమలు అంతం కాదని, ఆరంభం మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాస్కో కేటీఆర్, సంక్షేమ పథకాల ప్రవాహాల్లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పథకాలను ప్రారంభించారు. కొణిజర్ల మండలం చినగోపతిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, ముదిగొండ మండలం ఖానాపురం మంత్రి కోమటిరెడ్డి, రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాలుగు సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఈ పథకాల అమలుకు ఏడాదికి ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు ఒక గ్రామంలోనే ఇస్తారా? అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి పథకాన్ని సాచ్యురేషన్ మోడ్ లో అమలు చేస్తామని చెప్పారు. గత పాలకులు నాలుగు గోడల మధ్య, గడీల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారని, తాము ప్రజల మధ్య ఎంపిక చేశామన్నారు. పేదలకు ఇల్లు, రేషన్ కార్డులు రాకుండా సమాజానికి ద్రోహం చేసేవాళ్లు గ్రామసభల్లో గొడవలు చేయాలని ప్రయత్నం చేశారని, గ్రామ సభల్లో అధికారులు ప్రకటించే పేర్లే చివరి జాబితా అని ప్రజలను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు.
ప్రతిపక్షాలకు మహిళలే సమాధానం చెప్పాలి
గ్రామసభలు పెట్టి నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి మహిళలే సమాధానం చెప్పాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో ఈ 13 నెలల నుంచే ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. సోమవారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చెప్పారు.
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
అర్హులైన పేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని గుర్తు చేశారు. నిధులను జాగ్రత్తగా వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత పెండింగ్ లో ఉన్న రూ.7,600 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేశామని చెప్పారు. మొదటి ఏడాదే రైతుల సంక్షేమానికి రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.