అంబేద్కర్ ఇండియాలో పుట్టడం మన అదృష్టం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: డా. బీఆర్ అంబేద్కర్ ఇండియాలో పుట్టడం మన అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 6) హైదరాబాద్ జేఎన్టీయాలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయం చదువుకోవటం మీ అదృష్టమని.. రేపటి భవిష్యత్తుకు మీరే పునాదులని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని సూచించారు. విద్య ద్వారా మాత్రమే పరిపూర్ణత లభిస్తుందని అన్నారు. విద్య ద్వారానే పరివర్తన తీసురాగలమనే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతున్నదని తెలిపారు.   

‘‘ఇవాళ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమం. ఆయన జీవితంలో ఎప్పుడు నెగిటివ్‎గా స్పందించలేదు. ప్రతి విషయంలో పాజిటివ్‎గానే ముందుకు వెళ్ళారు.  క్లాస్ రూముల బయట కూర్చొని ఆయన చదువుకుని రాజ్యాంగం రాశారు. ఈ రోజు సమానమైన హక్కులు పొందుతున్నం అంటే ఆయన కార్యాచరణే. చదువు ద్వారానే అన్ని సమస్యలు సాధ్యం అనేది విద్యార్థులు గుర్తించాలి. అంబేద్కర్ కన్న కళలు సాకారం చేయాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరూ నెలలో ఒక్క సారైన చదవాలి’’ అని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు మాత్రమే అంబేడ్కర్ అని కొంత మంది తప్పుగా చిత్రీకరించారని..  కానీ ఆయన అన్ని వర్గాల కోసం, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారని చెప్పారు. దళిత మహిళ కోసమే కాకుండా ప్రతి మహిళ కోసం ఆలోచించారన్నారు.