తెలంగాణ తల్లి విగ్రహంలో అమ్మ.. నాయనమ్మ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే ఒక అమ్మ, ఒక నాయనమ్మ కనిపిస్తున్నారని, చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక నుంచి తెలంగాణ తల్లి ఉత్సవాలను డిసెంబర్  9న అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

డిసెంబర్ 9న కూడా అధికారిక నిర్వహణకు గెజిట్  విడుదల చేసి  లాంఛనాలు పూర్తిచేస్తామన్నారు. ‘‘తెలంగాణ తల్లిలో  పంటల పచ్చదనానికి ఆకుపచ్చ చీర ప్రతిబింబం. రాజ్యంలో హింస పెరిగినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దానికి పీఠంపైన పిడికిళ్లు, ఎరుపు ప్రగతిశీల భావాలు ఉద్యమాలకు గుర్తు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ సుభిక్షంగా ఉండాలని చెప్పేదే ఆపన్న హస్తం. తెలంగాణలో పండే పంటలన్నీ తల్లి చేతిలో ఉన్నట్లు చూపించాం. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది” అని భట్టి పేర్కొన్నారు.