అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : భట్టి విక్రమార్క

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
  • ఖమ్మం వరద సహాయక చర్యలను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో వరద పరిస్థితిపై సమీక్ష

మధిర, వెలుగు : భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మధిరలో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం కరీంనగర్ పర్యటనను సగంలోనే రద్దు చేసుకొని శనివారం అర్ధరాత్రి మధిరకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన మత్స్యకార సభ్యుడు తోటపల్లి వెంకటేశ్వర్లు వలను తొలగించేందుకు బుగ్గవాగులోకి వెళ్లి చిక్కుకోగా, విషయం తెలుసుకున్న భట్టి కలెక్టర్, సీపీలను అలర్ట్​ చేశారు. గంటల పాటు ప్రయాసపడి వాగు మధ్యలో నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి వెంకటేశ్వర్లు ప్రాణాలను కాపాడిన గజ ఈత గాళ్లను,  అధికార యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం అభినందించారు.

పునరావాస కేంద్రం పరిశీలన 

లోతట్టు ప్రాంతాల ప్రజలను మధిర 100 పడకల ఆసుపత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయగా అర్ధరాత్రి పునరావాస కేంద్రానికి డిప్యూటీ సీఎం చేరుకున్నారు. పునరావస కేంద్రంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మధిర నియోజకవర్గంలో ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో భట్టి సమీక్షించి సమస్యను పరిష్కరించారు. 

వైరా/ఎర్రుపాలెం : వైరాలోనే 5 వార్డు ఇందిరమ్మ కాలనీలో డిప్యూటీ సీఎం పర్యటించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎర్రపాలెం బీమవరం అగ్రహారంలో వరదలో చిక్కుకొని శనివారం మృతి చెందిన మలిశెట్టి  సాంబ కుటుంబాన్ని డిప్యూటి సీఎం ఆదివారం రాత్రి పరామర్శించారు. అంతకుముందు మీనవొలు లింక్ రోడ్డు లోని వరదను ట్రాక్టర్ మీద వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇటీవల హైదరాబాద్ లో స్టూడెంట్స్ చేతుల్లో హత్యకు గురైన ప్రశాంత్ కుటుంబాన్ని అయ్యగారి గుడి వెళ్లి పరామర్శించారు.