కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించారు: భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించారు: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, వెలుగు: దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. దేశంలో స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపుతో దేశ, రాష్ట్ర ప్రజలు తమకు అద్భుతమైన విజయాన్ని అందించారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, క్యాడర్‌‌కు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం: మహేశ్‌కుమార్ గౌడ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి గతంలో మూడు ఎంపీ స్థానాలు ఉంటే.. ఇప్పుడు 8 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు చెప్పారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని చెప్పారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ 12 సీట్లు గెలవాల్సి ఉండగా, బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందంతో ఆ పార్టీ 8 స్థానాలను గెలుచుకుందని ఆరోపించారు. అయినా తమ పాలనకు ఈ ఫలితాలను రెఫరెండంగా భావిస్తామని చెప్పారు. తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. బీజేపీని గెలిపించేందుకే బలహీనమైన అభ్యర్థులను బీఆర్‌‌ఎస్‌ బరిలో నిలిపిందని ఆరోపించారు. కాగా, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్‌ను గెలిపించారని, ఈ విజయం రేవంత్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాల్లో గెలిపించిన ఓటర్లకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. 

 

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సంబరాలు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 8 ఎంపీ సీట్లు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్‌లో సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి, డ్యాన్స్‌లు చేశారు. మూడు ఎంపీ స్థానాల నుంచి 8 ఎంపీ స్థానాలు రావడం సంతోషంగా ఉందని కార్యకర్తలు పేర్కొన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి హర్కర వేణుగోపాల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.