గత పాలకులు చేసిన అప్పులు తీర్చే పనిలో ఉన్నాం : మల్లు భట్టి విక్రమార్క

గత పాలకులు చేసిన అప్పులు తీర్చే పనిలో ఉన్నాం : మల్లు భట్టి విక్రమార్క
  • ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ
  • సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ

మధిర, వెలుగు: గత పాలకులు 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి పోయారు. వాటిని తీర్చే పనిలో మేము ఉన్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా  మధిరలో ఇందిరా పాల ఉత్పత్తి కేంద్రం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిమిషం ప్రజల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతిరోజు 18 గంటలు పని చేస్తున్నామని,  ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల అవసరాలకు ఇబ్బంది రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. 

సర్వేను సక్సెస్​ చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను సక్సెస్​ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం మధిర తహసీల్దార్  ఆఫీస్​ నుంచి సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా రివ్యూ నిర్వహించారు. సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక,  సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను  ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే) నిర్వహణ, విధి విధానాలను క్యాబినెట్  సమావేశంలో చర్చించి ఆమోదించామని తెలిపారు. 

ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సర్వే చేపడుతుందని, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. వివరాలు సేకరించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, తుమ్మల నాగేశ్వర రావు వివిధ ప్రాంతాల నుంచి వీసీలో పాల్గొని పలు సూచనలు చేశారు. 

సీఎస్​ శాంతి కుమారి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి సమగ్ర సర్వేను విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ఏ ఇల్లు మిస్  కాకుండా ప్రక్రియ పూర్తి చేయాలని, షెడ్యూల్  రూపకల్పన, స్టిక్కర్, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని సూచించారు. ప్రజల వివరాలను గోప్యంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.