చెన్నూర్​లో సోలార్ వెలుగులు

చెన్నూర్​లో సోలార్ వెలుగులు
  • 11 మెగావాట్ల ప్లాంట్​ను ఏర్పాటు చేసిన సింగరేణి
  • ఇయ్యాల ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కోల్ బెల్ట్/చెన్నూర్/జైపూర్​, వెలుగు: చెన్నూర్ మండలం శివలింగాపూర్​లో ఏర్పాటు చేసిన సింగరేణి 11 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్​ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. మార్కెట్​లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి సంస్థ సోలార్​ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. 

ఇప్పటికే జైపూర్​లో 1,200(600×2) థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) ను సక్సెస్​ఫుల్​గా నడుపుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తోంది. మరోవైపు భూమిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల ద్వారా 234 మెగావాట్లు, జైపూర్ ఎస్టీపీపీ రిజర్వాయర్​పై వాటర్ ఫ్లోటింగ్ విధానంలో మరో 10 మెగావాట్ల సోలార్ పవర్​ను ఉత్పత్తి చేస్తోంది. త్వరలో జైపూర్ ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ మూడో ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నూర్​ సమీపం ఉన్న శివాలింగాపూర్​లోని మూసివేసిన చెన్నూర్-–2 బొగ్గు గనుల ఖాళీ స్థలాల్లో సింగరేణి యాజమాన్యం కొత్తగా 11 మోగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
 
విద్యుత్ ​కేంద్రానికి అనుసంధానం

జైపూర్ పవర్ ప్లాంట్​లో ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్, 5 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్ సోలార్​ను సింగరేణి నడుపుతోంది. మరోవైపు సింగరేణి ఖాళీ స్థల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా చెన్నూర్–కోటపల్లి ప్రధాన రహదారి పక్కన  సింగరేణి సంస్థకు సంబంధించిన 55 ఎకరాల్లో 11 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం  తీసుకొని ఏడాదిన్నర క్రితం రూ.66 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. 

పుణేకు చెందిన ఎన్రిచ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పనులు ప్రారంభించి ఇటీవల పూర్తిచేసింది. ఇక్కడి ప్లాంట్​లో ఉత్పత్తి చేసిన విద్యుత్​ను సింగరేణి విద్యుత్​ కేంద్రం 132 కేవీకి అనుసంధానం చేయనున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా స్థానికంగా కొందరికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. శనివారం  11మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్​ను, మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్​, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సింగరేణి సీఎండీ బలరాం నాయక్​తో​కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. 

ALSO READ : మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు!

పర్యటనకు పటిష్ట బందోబస్తు: సీపీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు చేతన, భాస్కర్​తో కలిసి డిప్యూటీ సీఎం పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. హెలీప్యాడ్ గ్రౌండ్, రామగుండం, గోదావరిఖని, జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ప్లాంట్​తో సహా చెన్నూర్​లో నిర్వహించే సభా ప్రాంగణాలను పరిశీలించారు. పార్కింగ్, సభకు వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.