హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పిలుపునిచ్చారు. గురువారం (నవంబర్ 21) గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన సర్వేపై నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉండొద్దని సూచించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తోన్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొన్ని నియోజకవర్గా్లలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్ 9 లోగా ప్రభుత్వ నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు.