ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి

ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి

హైదరాబాద్: ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేం పని చేస్తున్నామని తెలంగాణ ప్రజలనుద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఖజానా నుండి ప్రతిపైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ (అక్టోబర్ 9) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో కొలువుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహించిన రెండు నెలల్లోనే ఫలితాలు రిలీజ్ చేశామని.. చెప్పిన డేట్‎కే నియామక పత్రాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని.. పదేండ్లు టీచర్ల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటిస్తే.. నోటిఫికేషన్ అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారు.. ఆ కుట్రలన్నీ తిప్పికొట్టి విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. 

ALSO READ | నామోషీగా ఫీలవుతున్నారు.. మొత్తం మార్చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఇఫ్పుడు ఉద్యోగాలు వస్తున్నాయని.. ఈ వేదికపై మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా విద్యపై దృష్టి పెట్టిందని.. విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలన్నదే మా తపన అని అన్నారు.