- అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్: డిప్యూటీ సీఎం భట్టి
- ఒక్కోటి 20-25 ఎకరాల్లో 25 కోట్లతో నిర్మాణం
- 11న 20 స్కూళ్లకు శంకుస్థాపన
- ఈ ఏడాది మొత్తం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి
- స్కూల్స్ డిజైన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 20 నుంచి -25 ఎకరాల్లో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 11న 20 స్కూళ్లకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు. ఇవి వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం సెక్రటేరియెట్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి యంగ్ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ ను భట్టి విడుదల చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలని నిర్ణయించామని తెలిపారు. వీటిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే 20 నుంచి 22 స్కూళ్ల కోసం స్థలం సేకరించామని వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో 1,023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. కానీ అందులో 650 స్కూళ్లకు సొంత భవనాలు లేవు. అలాంటి స్కూళ్లను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కలుపుతాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చవుతుంది. కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తాం. అవసరమైతే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ లో చిన్న థియేటర్ కూడా కడతాం” అని తెలిపారు.
దసరా కానుక: కోమటిరెడ్డి
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. విద్యార్థులకు దసరా కానుక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇది అందరికీ శుభవార్త అని చెప్పారు. ప్రభుత్వం మంచి చేస్తున్నా ప్రతిపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వీటిని వచ్చే అకడమిక్ సంవత్సరం ప్రారంభం నాటికే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించారని చెప్పారు.