దళిత బంధు దారి మళ్లితే ఊరుకోం: డిప్యూటీ సీఎం భట్టి

దళిత బంధు దారి మళ్లితే ఊరుకోం: డిప్యూటీ సీఎం భట్టి
  • వారంలోగా లబ్ధిదారులకు అప్పగించండి
  • తీసుకున్నోళ్లంతా వ్యాపారం చేయాల్సిందే
  • ఆవులు, బర్రెలు ఏమైనయ్.. ఎక్కడ అమ్ముకుండ్రు
  • స్పెషల్ ఆఫీసర్ల వద్ద సమాచారం లేకుంటే ఎలా?
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం

ఖమ్మం: దళితబంధు దారి మళ్లితే ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు.  చింతకాని లో దళిత బంధు అమలుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..  వారం లోపల దారి మళ్లిన వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు.  దుర్వినియోగంలో లబ్ధిదారుని పాత్ర ఎంతో స్పెషల్ ఆఫీసర్లది కూడా అంతేనన్నారు. దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపికైందని, మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రెండో విడుత నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 

దళిత బంధు కింద మంజూరైనవి లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అవి దారి మళ్లాయా..? అనేది అధికారులు గుర్తించాలన్నారు.  ఇతరులకు అమ్మారా, బదిలీ చేశారా? అనేది తేల్చాలని సూచించారు.  వాటన్నిటిని వారంలోగా గుర్తించి తిరిగి లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. 

దళిత బందు కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని చెప్పారు. మేకలు, గొర్రెలు ఎందుకు చనిపోయాయని డిప్యూటీ సీఎం లబ్ధిదా రులను ప్రశ్నించారు. వాటికి బీమా ఇప్పించారా..? అని అడిగారు. బర్రెలు, ఆవులు ఏమయ్యాయి..? వాటిని ఎక్కడ అమ్ముకున్నారని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.  

సీబీలు, ట్రాలీలను ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పనులలో ఉప యోగించాలని అధికారులకు సూచించారు. జేసీబీ యజమానులకు, కాంట్రాక్టర్లకు మధ్య అధికారులు అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలన్నారు.