తెలంగాణలో విద్యుత్ కోతలు అనే మాటే లేదు.. ఎలా సాధ్యమైందంటే..

తెలంగాణలో విద్యుత్ కోతలు అనే మాటే లేదు.. ఎలా సాధ్యమైందంటే..

హరిత ఇంధన ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది.  డిప్యూటీ సీఎం, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సుదీర్ఘకాలంగా నిరంతర కృషితో రాష్ట్రంలో కొత్త వెలుగులకు అడుగులు పడుతున్నాయి. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇంధన విధానాన్ని రూపొందించలేకపోయింది. కొత్త విధానం పక్కనపెడితే కొనసాగుతున్న డిస్కమ్​లకు ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో అవి మూలనపడే పరిస్థితిని తీసుకొచ్చారు.

పర్యవేక్షణ లోపంతో  భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ఆలస్యమై ప్రాజెక్టు ఖర్చు భారీగా పెరిగింది.  రాష్ట్ర ఖజానాకు అవి గుదిబండలుగా మారాయి. ఇక చత్తీస్​గఢ్​వంటి రాష్ట్రాలతో  గత పాలకులు చేసుకున్న కొనుగోలు ఒప్పందాలు విద్యుత్ వ్యవస్థకు, రాష్ట్ర ఖజానాకు మోయలేని భారంగా మిగిలాయి. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తూ రాష్ట్రంలో విద్యుత్ కోతలు అనే మాట లేకుండా చేశారు.

భద్రాద్రిలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, యాదాద్రిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఏడాదిలోపు యాదాద్రి థర్మల్ పవర్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఇదంతా ఒక భాగమైతే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రపంచం మొత్తం హరిత ఇంధనం వైపు అడుగులు వేస్తోంది.  తక్కువ ఖర్చుతో, కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసి దేశపటంలో  తెలంగాణ విద్యుత్తు రంగానికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టేందుకు ఇందనశాఖ మంత్రి చేసిన కృషి ఫలించింది. 

దేశవ్యాప్తంగా ఆదరణ 
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 దేశవ్యాప్తంగా అందరి ఆదరాభిమానాలు చూరగొంటోంది. రాష్ట్రానికి  తక్కువ ఖర్చుతో,  కాలుష్య రహితంగా విద్యుత్ ఉత్పత్తి  అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షించి తద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని, ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చేలా కొత్త పాలసీ ఉంది. పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలకు  చోటు కల్పించారు.  భూమి, నీరు, పన్నులు, అనుమతులకు సంబంధించి కొత్త పాలసీలో స్పష్టంగా విధి విధానాలు ఖరారు చేశారు. హరిత ఇంధన ఉత్పత్తికి పరిశ్రమలు స్థాపించడం, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్తు అమ్మకం వంటి అంశాలకు సంబంధించి ఈ పాలసీలో స్పష్టత ఇచ్చారు.

మహిళా సాధికారత సంకల్పంతో  కొత్త ఇంధన పాలసీలో  స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి వారికి ప్రత్యేక రాయితీలు కల్పించారు. హరిత ఇంధన విధానం-2025పై  తెలంగాణ ప్రభుత్వం11 జనవరి 2025న  జీవో జారీ చేసిన నాటి నుంచి 10 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. 2070 నాటికి నెట్ జీరో పొల్యూషన్ లక్ష్యాన్ని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని పాలసీ విడుదల క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రం  ప్రస్తుతం 26,212 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 

విద్యుత్ ​ఉత్పత్తి సామర్థ్యం 
థర్మల్: 14,164 మెగావాట్లు 
సోలార్: 7,889 మెగావాట్లు 
విండ్ పవర్: 128 మెగావాట్లు 
హైడ్రో :2,518 మెగావాట్లు 
న్యూక్లియర్: 211 మెగావాట్లు 
ఇతర గ్రీన్ పవర్ ప్రాజెక్టు ద్వారా 93 మెగావాట్లు

2029-–30 నాటికి 49,104 మెగావాట్లకు, 2034-–35 నాటికి 66,694 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సోలార్, విండ్, హైడ్రో, ఎనర్జీ స్టోరేజీ వంటి వ్యవస్థలతో పాటు కొత్త  గ్రీన్ పవర్ ఉత్పత్తి ప్రాజెక్టు ద్వారా సాధించాలని కొత్త పాలసీలో నిర్ధారించారు.

గ్రీన్ పవర్ అభివృద్ధి కోసం కొత్త పాలసీలో ప్రణాళికలు 

1. సోలార్ పవర్ ప్రాజెక్టులు: పెద్ద సంఖ్యలో సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటిని పెద్ద ఎత్తున గ్రిడ్​కు అనుసంధానం చేయడం.  నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి భారీ జలాశయాల్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ఫ్లోటింగ్ సోలార్ పవర్​ను ఉత్పత్తి చేయడం.  డి సెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ సెక్రటేరియట్, ఎంసీహెచ్ఆర్డీ  వంటి పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి.

2. విండ్ పవర్: ఈ ప్రాజెక్టులను తెలంగాణ రెడ్ కో,  ట్రాన్స్​కో సమన్వయం చేయాలి.  సాంకేతిక ప్రయోజనాల కోసం నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ  అనుమతులు ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించడం. 

3. శక్తి నిల్వ వ్యవస్థలు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం: ఇందులో నెట్వర్క్ వినియోగాన్ని పెంచడం, గ్రీన్ పవర్ నిల్వ సామర్థ్యాన్ని ఉపయోగించడం వంటి అంశాలు స్పష్టం చేశారు. 

4. హైబ్రిడ్ ప్రాజెక్టులు: సోలార్+విండ్ ప్రాజెక్టులు:  ఎత్తైన కొండ ప్రాంతాల్లో విండ్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. భారీ గాలి పంకాల చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో నేలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడమే హైబ్రిడ్ విధానం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సూర్య కిరణాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం, సాయంత్రం నుంచి వీచే గాలుల ఆధారంగా విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం. 24 గంటల్లో ఏదో ఒక విధానంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రెండు మార్గాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఒకే ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా గ్రిడ్​కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు, స్థలం వంటి పెట్టుబడులు ఆదా అవుతాయి.

5. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు: నదులు వేగంగా ప్రయాణించే ప్రాంతాలు గుర్తించి. దిగువ భాగంలో టర్బైన్లు ఏర్పాటుచేసి నదీ ప్రవాహం వేగాన్ని 
విద్యుత్తుగా ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

మౌలిక వసతుల అభివృద్ధి
సింగిల్ విండో విధానంలో గ్రీన్ పవర్ ప్రాజెక్టులకు అనుమతి. లాజిస్టిక్స్, ట్రాన్స్​పోర్ట్, విద్యుత్ సౌకర్యం, నీళ్ల కనెక్షన్ వంటివి వేగంగా ఏర్పాటు చేస్తామని కొత్త పాలసీలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న 14 నుంచి 21 రోజుల మధ్య అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తాం అని కొత్త చట్టంలో వివరించారు.  గ్రీన్ పవర్ రంగంలో దేశంలోనే  తెలంగాణను  అగ్రభాగాన నిలబెట్టేందుకు ఈ ప్రోత్సాహకాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. 2030 నాటికి రాష్ట్రంలో 6వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, 2035 నాటికి ఉండే డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని 12 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇంధన శాఖ కార్యదర్శి చైర్మన్​గా ఉండే కమిటీ  కొత్త పవర్ పాలసీ అమలును పర్యవేక్షిస్తుంది. 

భారీగా ప్రోత్సాహకాలు 
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కేటాయించిన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా (నాలా కన్వర్షన్) ఉచితంగా చేస్తారు.  గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టు స్థాపన కోసం భూమి కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు స్టాంప్ డ్యూటీ రియింబర్స్​మెంట్ చేస్తారు. ఈ పరిశ్రమలు వినియోగించుకునే  నీటిపై  కేవలం 25 శాతం మాత్రమే చార్జీలు విధిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు100% స్టేట్ జీఎస్టీ నుంచి రాయితీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం, ఎంటర్​ప్రైజెస్​) వీరికి కూడా 100%  స్టేట్ జీఎస్టీలో రాయితీ కల్పించారు.  మిగిలినవారందరికీ స్టేట్ జీఎస్టీలో 50 శాతం రియింబర్స్​మెంట్ సౌకర్యం కల్పించి పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు.


మారబోయిన మధుసూదన్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ