ఓటు జిహాద్‌‌ వల్లే ఓడిపోయాం..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌‌

ఓటు జిహాద్‌‌ వల్లే ఓడిపోయాం..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌‌

న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ తెలిపారు. ఆదివారం ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. గత లోక్‌‌సభ ఎన్నికల్లో ‘ఓట్‌‌ జిహాద్‌‌’, తప్పుడు కథనాల వల్లే బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. ‘‘లోక్‌‌ సభ ఎన్నికల్లో ఓట్‌‌ జిహాద్‌‌ బాగా పనిచేసింది. ఒక కమ్యూనిటీ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు.

మోదీని అధికారంలో నుంచి దించేయాలనే ఉద్దేశంతోనే వారు ఓటు వేశారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్‌‌ జిహాద్‌‌ పనిచేయదు”అని ఫడ్నవీస్‌‌ పేర్కొన్నారు. ‘‘లోక్‌‌సభ ఎన్నికల సమయంలో మహా వికాస్‌‌ అఘాడి (ఎంవీఏ).. ప్రధాని మోదీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు.. రిజర్వేషన్లను ఎత్తేస్తారు.. అని ఓ నకిలీ కథనాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. అందుకే రాహుల్‌‌కు, ఎంవీఏకి ఓటేశారు.

కానీ, ఇటీవల రాహుల్‌‌ గాంధీ విదేశీ పర్యటనలో దేశంలో రిజర్వేషన్ల ఆవశ్యకత తగ్గుతోందని, వాటిని అంతం చేస్తామన్నారు. అంటే లోక్‌‌సభ ఎన్నికల్లో వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం’’అని ఫడ్నవీస్‌‌ వివరించారు. మహాయుతి క్యాంపులో పాండువులు, మహా వికాస్‌‌ అఘాడీలో కౌరవులు ఉన్నారన్నారు. కౌరవులు కౌరవులతోనే, పాండువులు పాండువులతోనే ఉంటారని చెప్పారు. ఎంవీఏ నేతలకు ‘రోకో’(ఆపడం) మాత్రమే తెలుసని, అభివృద్ధిపై చర్చ పెడితే వారు పారిపోతారని తాను పందెం వేస్తా అన్నారు.