లక్ష్మీపురం స్కూల్​ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మల్లు భట్టి విక్రమార్క

లక్ష్మీపురం స్కూల్​ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడానికి ప్రజా ప్రభుత్వం లక్ష్మీపురం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం స్కూల్​ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముందే  పరిసర గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావడానికి వీలుగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

రూ. 6.20 కోట్లతో పాతర్లపాడు నుంచి వయా గోవిందపురం మీదుగా లక్ష్మీపురం వరకు, రూ.6.80 కోట్లతో రేపల్లెవాడ నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురంలో ఉండే తాను చదువుకోడానికి మూడో తరగతి నుంచి వైరాకు ఏడు కిలోమీటర్లు  నడుచుకుంటూ వెళ్లేవాడినని, ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు సింగల్ టీచరే అన్ని పాఠాలు చెప్పేవారని గుర్తు చేశారు. మోకాళ్ల లోతు నీళ్లు, గుట్టల మీదుగా నడుచుకుంటూ స్కూళ్లకు వెళ్లి వచ్చేదని, ఎలా తిరిగి వస్తానోనని తన తల్లిదండ్రులు ఆందోళన చెందేవారని చెప్పారు. ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని ఈ పాఠశాలలకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని డిజైన్​ చేసినట్టు తెలిపారు. 

ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి విద్యా బుద్ధులు నేర్పించేందుకు ఈ స్కూళ్ల రూపకల్పనలో భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్​ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం  చేసి పేదలకు చదువును దూరం చేసే కుట్రలు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు బడుగు, బలహీన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ స్కూళ్లు చారిత్రాత్మకం కానున్నాయన్నారు. 

కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, డీఈవో సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బీఎస్ఈ హేమలత, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రతిపక్షాలకు  అరుదైన గౌరవం

లక్ష్మీపురంలో స్కూల్ భవన నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి భట్టి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించి అరుదైన గౌరవం ఇచ్చారు. 

కృష్ణాపురంలో ప్రజా దర్బార్ 

మధిర మండలం కిష్టాపురం గ్రామంలో శుక్రవారం  సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు నివాసం వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాదర్భార్​ కార్యక్రమం నిర్వహించారు.   గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. పెండింగ్​ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

సోలార్ విద్యుత్ తో రైతుకు మేలు 

సోలార్ విద్యుత్ తో రైతుకు మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి అన్నారు. మధిర మండలం  సిరిపురంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులపై భారం మోపకుండా ప్రభుత్వమే సిరిపురంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 

ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు, రైతులతో మమేకమై  విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ఉద్యోగాలు లేని యువత స్వయం కృషితో ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తోందన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మధిర నియోజకవర్గం వైపు దేశం చూసేలా చేస్తామన్నారు.