అయిజ/గద్వాల/పెబ్బేరు, వెలుగు : పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్ర సంపదను మొత్తం దోచుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. జన జాతర ర్యాలీలో భాగంగా శనివారం గద్వాల, అయిజ, పెబ్బేరు పట్టణాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్లు దండుకున్నారన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, అది మునిగిపోయే నావ లాంటిదని, ఆ పార్టీలో ఉండలేక చాలామంది కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరి అలంపూర్ పరువు తీశారన్నారు.
అయిజ పట్టణంలో డిగ్రీ, బాలికల జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, ఆరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న పులికల్ రోడ్డు, పెద్దవాగు బ్రిడ్జిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పదేండ్లుగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేని బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. అన్ని గ్యారంటీలు అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. నాగర్‌కర్నూల్ క్యాండిడేట్ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శెక్షావలి ఆచారి, గద్వాల ఇన్‌చార్జి సరిత, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ దీపక్ ప్రజ్ఞ, ధరూర్ జడ్పీటీసీ పద్మ, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ పాల్గొన్నారు.