ఎడ్యుకేషన్​ కోసం బడ్జెట్​లో ఎన్ని నిధులైనా కేటాయిస్తం : మల్లు భట్టి విక్రమార్క

ఎడ్యుకేషన్​ కోసం బడ్జెట్​లో ఎన్ని నిధులైనా కేటాయిస్తం : మల్లు భట్టి విక్రమార్క
  • విద్య​కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నం
  • ఏడాది లోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం  
  • ఓవర్సీస్ స్కాలర్​షిప్స్ సంఖ్యను మరో వందకు పెంచుతున్నాం
  • స్కూల్స్​ ఫస్ట్​ రోజే బుక్స్, యూనిఫామ్స్​ పంపిణీ ఇదే తొలిసారి

ఖమ్మం, వెలుగు: విద్యాభివృద్ధికి బడ్జెట్​లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్​ పంపిణీ చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. గత సర్కారుకు ప్రభుత్వ పాఠశాలలంటే నిర్లక్ష్య ధోరణి ఉండేదని, ఆ ధోరణి నుంచి గవర్నమెంట్ స్కూల్స్ పై ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

బుధవారం ఖమ్మం ఎన్ఎస్​పీ క్యాంప్​ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అగ్రికల్చర్​ మినిస్టర్​తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్​, యూనిఫామ్ సరైన సమయంలో అందిస్తే మంచి ఫలితం ఉంటుందనే ఆలోచనతో పాఠశాల తెరిచిన రోజునే పంపిణీకి కార్యాచరణ చేశామని చెప్పారు. ఇంగ్లిష్ మీడియంను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నదని తెలిపారు. 

రెసిడెన్షియల్​ స్కూల్స్​​ పక్కా భవనాలకు నిధులు

రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్​కు పక్కా భవనాలు నిర్మించేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో నిధులు కేటాయించామని భట్టి విక్రమార్క చెప్పారు. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ ల సంఖ్యను మరో వందకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రూ.2 వేల కోట్ల నిధులతో పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల తెలిపారు.

మెగా డీఎస్సీ ద్వారా సుమారు 11 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆలోచనా విధానాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు. అనేక కష్టాలున్నా ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో ఆధునిక విద్య, ఆధునిక వైద్యం అందేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.