అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మల్లు భట్టి విక్రమార్క

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి : మల్లు భట్టి విక్రమార్క
  •     డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం మధిరలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర మున్సిపల్​ పరిధిలో టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ట్యాంక్ బండ్ పై రోడ్డు వెడల్పుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అంబారుపేట చెరువులో గణేశ్​ నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చెరువును గుర్తించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మధిర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ చేపట్టాల్సిన  కొత్త పనులు, బీటీ రోడ్ల సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విద్యార్థులు లేక మూతబడిన స్కూళ్ల భవనాలను, నియోజకవర్గంలో మంజూరు అయి, ఇతర ప్రదేశాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలకు కేటాయించాలని సూచించారు.

కట్టలేరు, జాలిముడి పనులు త్వరగా పూర్తి చేయించాలని చెప్పారు. స్నానాల లక్ష్మీపురం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మధిర పెద్ద చెరువు, జమలాపురం, ఇంద్రాయ చెరువు బండ్లను అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీ కార్యాలయాలకు భవనాల్లేని వాటికి  నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూ. 34 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను  పరిశీలించి పలు సూచనలు చేశారు.

రూ 2.65 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని సందర్శించారు. ప్రభుత్వ కళాశాల, డిగ్రీ కళాశాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, ఆరోగ్య శాఖ ఈఈ  ఉమామహేశ్వర రావు, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

అందరూ భాగస్వాములు కావాలి

మధిర నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి అఖిలపక్ష నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి చేయబోయే పనులను వివరించి, చేయాల్సిన పనుల గురించి పార్టీలవారీగా ప్రతిపక్ష నాయకుల అభిప్రాయాలను భట్టి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పలు సూచనలు చేశారు. మధిరను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.  మధిరలో పలు రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకోవాలని, డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని చెప్పారు. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్, ధర్నా చౌక్, రైల్వే  అండర్ పాస్ బ్రిడ్జి, లెదర్ పార్క్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైరా నుంచి ఎర్రుపాలెం వరకు డబుల్  రోడ్డు వేయించాలని, మధిర పట్టణాన్ని సుందరీకరణ చేయాలని, పంప్ హౌస్ వద్ద ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్కును ఏర్పాటు చేయడంతోపాటు పలు సూచనలు చేశారు.

సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యా లత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు డాక్టర్ రామనాథం, మల్లాది హనుమంతరావు, పుల్లారావు, బీజేపీ నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, పాపట్ల రమేశ్, సీపీఐ నేత బెజవాడ రవి, సీపీఎం నాయకులు నరసింహారావు, మంద సైదులు పాల్గొన్నారు.

వినతిపత్రాలు.. విజ్ఞప్తులు 

సంక్రాంతి సందర్భంగా మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంగళవారం పలువురు భిమానులు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలు వ్యక్తిగత, సామూహిక సమస్యలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందజేశారు. స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొర్రూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి, పూణేలో జరిగిన 67వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్​ను క్యాంపు కార్యాలయంలో అభినందించారు.