
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, వెలుగు : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని యండపల్లి గుట్ట వద్ద ఇండస్ర్టీయల్ పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్దకు ఎండ్లబండిపై వచ్చి మునగాల నుంచి నక్కలగరువు వరకు
రూ.2.70 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న పీఆర్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అల్లీనగరం నుంచి బయ్యారం వరకు రూ.2 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు, రాయపట్నం నుంచి మడుపల్లి వరకు, దేశినేనిపాలెం నుంచి మడుపల్లి వరకు రూ.6 .50కోట్లతో నిర్మాణం చేపట్టనున్న పీఆర్ రోడ్డుకు శంకుస్ధాపన లుచేశారు.
బ్యాంకర్లతో సమావేశం
మధిర క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కింద లక్షన్నర వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఇప్పటికే రూ.13 వేల కోట్ల నిధులను రైతు రుణమాఫీ కింద విడుదల చేశామని చెప్పారు. రైతులను రుణ విముక్తులను చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకే అకౌంట్ ద్వారా సుమారు రూ.30 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయన్నారు.
చెక్ డ్యామ్ పరిశీలన
వైరా : ఖమ్మం జిల్లా వైరా మండలలోని స్నానాల లక్ష్మీపురంలో నిలిచిపోయిన చెక్ డ్యామ్‌ను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.