ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం : మల్లు భట్టి విక్రమార్క

ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం : మల్లు భట్టి విక్రమార్క
  • పబ్లిక్‌‌, ప్రైవేట్ సెక్టార్స్‌‌లో భద్రతకు ప్రాధాన్యం 
  • సెక్యూరిటీ గార్డులకు మెరుగైనశిక్షణ ఇవ్వాలని వెల్లడి
  • ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్‌‌లోపాల్గొన్న మంత్రి శ్రీధర్​ బాబు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు,సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పబ్లిక్‌‌, ప్రైవేట్ సెక్టార్‌‌‌‌లోని ఉద్యోగులకు హైదరాబాద్‌‌లో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఫోర్త్‌‌సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్‌‌లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం నైపుణ్యం గల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల అవసరం ఉంటుందని తెలిపారు. 

హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌‌(హెచ్‌‌సీఎస్‌‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం‘‘ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024” జరిగింది. సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, రీజనల్ రింగ్‌‌రోడ్డుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని ఈ రంగంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేస్తున్నారని వెల్లడించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

సెక్యూరిటీ ఏజెన్సీలు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: శ్రీధర్ బాబు

ఐటీ మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1500 సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇందులో కేవలం 500 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను మాజీ పోలీస్ అధికారులు, కల్నల్స్ నిర్వహిస్తున్నందున భద్రతపై వారికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌‌కు వచ్చే యువత ఎక్కువగా ప్రైవేట్‌‌ సెక్యూరిటీ ఏజెన్సీల్లో పనిచేస్తున్నారని అన్నారు. కానీ వారికి ఆశించిన స్థాయిలో జీతాలు లేవని తెలిపారు. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌‌‌‌కి మంచి సెక్యూరిటీ వ్యవస్థ అవసరం అన్నారు.

 సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్‌‌లో  ప్రైవేట్‌‌ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించామని చెప్పారు. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ అనేది ఇండస్ట్రీస్‌‌ భద్రతను మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ సెక్యూరిటీ అనేది తప్పనిసరి అయ్యిందని అన్నారు.