ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్ర అభివృద్ధికి కృషి : మల్లు భట్టి విక్రమార్క

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్ర అభివృద్ధికి కృషి : మల్లు భట్టి విక్రమార్క
  • పారదర్శకంగా నియామకాల భర్తీ
  • వరద బాధితులను ఆదుకుంటాం : ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి
  • భద్రాద్రికొత్తగూడెండెవలప్​మెంట్​కు కృషి 
  • కొత్తగూడెంలో మంత్రి తుమ్మల ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్/ నెట్​వర్క్​, వెలుగు  :  విద్యా, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం లాంటి ప్రాధాన్యత రంగాల్లో  ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పోలీస్​ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాహిత్య ఉద్యమంలో, తెలంగాణ ప్రాంతం రాజుల పాలన నుంచి విముక్తికి చేసిన ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలకపాత్ర పోషించిందన్నారు. అల్లీ నగర్ ప్రాంతానికి చెందిన మహనీయుడు ఒట్టి కొండ రామా కోటయ్య బాల్యం నుంచి నాటి జాతీయ ఉద్యమాల స్ఫూర్తితో ప్రజా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.

ముదిగొండ, గోకినేపల్లి, వెంకటాయపాలెం, మధిర, తెల్దారుపల్లి, ఎర్రుపాలెం, రావినూతల, గోవిందాపురం మొదలగు ప్రాంతాలు నిత్య పోరాట క్షేత్రాలుగా ఉన్నాయని, బొమ్మ కంటి సత్యనారాయణ, రావెల్ల సత్యం, రావెల్ల వెంకటరామారావు లాంటి ఎందరో మహానీయులు సాయుధ పోరాటంలో భాగం అయ్యారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు చారిత్రక అనివార్యంగా మేధావులు భావించారని, తెలంగాణ సాహిత్య ఉద్యమానికి డాక్టర్  సి.నారాయణరెడ్డి, దాశరధి కృష్ణమాచారి లాంటి ఎందరో రచయితలు తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి పట్టణాలు, గ్రామాలలో పర్యటించిన నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమ స్ఫూర్తి రగిలించారన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన విరోచిత పోరాటాల ఫలితంగా ఈ ప్రాంతం రాజుల పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనమైందని, దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

హామీలన్నీ పక్కాగా అమలు.. 

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని, అన్ని గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రారంభించిన  మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 79 లక్షలకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశామని, దీని ద్వారా మహిళలకు దాదాపు రూ.84 కోట్ల 32 లక్షలు ఆదా చేసినట్లు చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా కింద జిల్లాలో 3 ,94 ,753 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.11.19 కోట్ల  సబ్సిడీ సొమ్ము జమ చేసినట్లు వివరించారు. జిల్లాలోని 1,15,180 మంది రైతులకు రూ.766 కోట్ల 66 లక్షల పైగా రుణమాఫీ చేసినట్లు తెలిపారు.

మిగతా పథకాలు కూడా ఇదే తరహాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి విద్యుత్ డిమాండ్ ను అంచనా వేస్తూ ఉత్పత్తి పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ నియామకాలు పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా విద్యా కమిషన్ ను ప్రభుత్వం నియమించిందన్నారు. 

వరద బాధితులకు అండ.. 

ఖమ్మంలో మున్నేరు వరద బాధఙతల ప్రాణాలు కాపాడుతూ సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేయడంలో జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. వరదల వల్ల ఇల్లు దెబ్బ తిన్న 15 వేల 96 కుటుంబాలకు రూ.16 ,500 చొప్పున పంపిణీ చేశామని తెలిపారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకూ రూ.10వేల పరిహారం, ఆస్తి, పశు నష్టం జరిగిన వాటికి పరిహారాన్ని అందజేస్తామని చెప్పారు. అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్,  అడిషనల్​కలెక్టర్లు డాక్టర్.పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. 

 ప్రజా పాలన దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు.  కొత్తగూడెం కలెక్టరేట్​లో కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​, ఎస్పీ ఆఫీస్​లో ఎస్పీ బి. రోహిత్​ రాజు జాతీయ జెండాలను ఎగురవేశారు.  ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టర్, క్యాంపు కార్యాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఇల్లెందు, మణుగూరులో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య,  పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డితోపా ఆయా చోట్ల పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో...

రాష్ట్రంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లాను నంబర్​ వన్​గా డెవలప్​ మెంట్​ చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు ఏదో ఒక యూనివర్శిటీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. కొత్తగూడెం(భద్రాచలం రోడ్​) నుంచి కొవ్వూరు రైల్వే లైన్​, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి రైల్వే లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రాచలాన్ని డెవలప్​ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. జిల్లాలో 57,983 మంది రైతులకు 415.27కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

వార్షిక ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ రైతు బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. పలు కారణాలతో జిల్లాలో మృతి చెందిన 761 మంది రైతులకు రూ. 33.65కోట్లు జమ చేసినట్లు చెప్పారు. వరద బాధితులు 2,144 కుటుంబాలకు ఆన్​లైన్​ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 16,500 వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 1948, సెప్టెంబర్​ 17న భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందన్నారు. అనంతరం గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్​ ఎగ్జిబిషన్​లోని స్టాల్స్​ను ఆయన సందర్శించారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్​, జారే ఆదినారాయణ, డీసీఎంఎస్​ చైర్మన్​ కొత్వాల శ్రీనివాస్​, కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్​ రాజుతో పాటు పలుశాఖల అధికారులు ఉన్నారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. విశ్వకర్మ ఫొటోకు పూలమాలలు వేశారు. వెనుకబడిన కులాల అభివృద్ధి రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.