మధిర, వెలుగు: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని మండలంలో గురువారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత నాగులవంచలో ఆయనకు ప్రజలు, మహిళలు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తగా బాధ్యతగా స్వీకరించిన కలెక్టర్ మహమ్మద్ ముజామ్మిల్ ఖాన్ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత చింతకాని మండలంలో పీఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.6.75 కోట్లతో తిమ్మినేనిపాలెం నుంచి చిన్నమండవ వరకు , రూ.9 కోట్లతో నాగులవంచ నుంచి పోలంపల్లి వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.