మాతో టచ్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : డిప్యూటీ సీఎం

 హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ పార్టీతో టచ్ లో ఉన్నారని డిప్యూటీ  సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లా కలెక్టర్లపై సైతం ఆయన అదే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు.  వీటివల్ల ఆయన మైండ్ సెట్‌ను మనం అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి తన రోల్ ప్లే చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత, కొత్త సమస్యలు ఉంటాయని తెలిపారు.  

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించడం ఎవరి తరమూ కాదన్నారు.  గతేడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని,  ఈ ఎన్నికల్లో ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడని చెప్పారు.  దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీల్లో ఒకటైన రైతు భరోసా పై ప్రభుత్వం మంత్రి వర్గం ఉప సంఘంతో కసరత్తు చేస్తుందని, రైతు భరోసా విధివిధానాలు ఏంటనేది త్వరలో క్లారిటీ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ హామీ అమలు చేశామని, మిగిలిపోయిన వారందరికి రుణమాఫీ చేసి జరుగుతుందన్నారు. రైతు భరోసా, రుణమాఫీపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. రుణమాఫీ చేస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. 

తమది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమానికి పెద్ధపీట వేస్తామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము అర్హులైన పేదలకు త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగుతుందని భట్టి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ లో గెలిచిందని, కర్ణాటకలో గెలిచిందని, కేరళలో గెలిచారని, వెస్ట్ బెంగాల్ లో గెలిచారని, మధ్య ప్రదేశ్ లో గెలిచారని, ఒక మహారాష్ట్రలో ఓడిపోయిందే చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.