యెండుపల్లిలో పారిశ్రామిక వాడ : మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి యెండుపల్లిలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని రొంపిమల్ల, జాలిముడి గ్రామాల్లో  బీటీ రోడ్డులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం  ఏర్పాటు చేసిన సభలో  డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పారిశ్రామిక వాడ అభివృద్ధిలో భాగంగా రొంపిమల్ల నుంచి యెండుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.80 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశామన్నారు. త్వరలో యెండుపల్లి పారిశ్రామిక వాడకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు. 

జాలిముడి ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ద్వారా రెండు మండలాలకు తాగు, సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.  ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జాలిముడి ప్రాజెక్టు వద్ద బీటీ రోడ్ నిర్మాణానికి రూ.52 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పదేండ్లు అధికారంలో ఉండి అమలు చేయని గత బీఆర్ఎస్ పాలకులు మూడు నెలలు పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం  కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని తెలిపారు. 

పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు ఒక గ్రూప్ -1 నోటిఫికేషన్ వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ని  ప్రక్షాళన చేయడంతో పాటు నోటిఫికేషన్ వేసిన పరీక్ష పేపర్ల లీకేజీ కాకుండా పారదర్శకంగా నిర్వహించబోతున్నామని చెప్పారు.  తమ ప్రభుత్వం బడ్జెట్​లో విద్యకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను నిలిపివేసి మోసం చేసిందని దుయ్యబట్టారు. తాము త్వరలోనే డ్వాక్రా మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.