సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క

సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క
  • కేసీఆర్​ నీ భాష మార్చుకో
  • నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.. అందుకే బీఆర్ఎస్​ గల్లంతైంది
  • ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్​
  • బోనకల్​లో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్ షో

మధిర, వెలుగు: కేసీఆర్ ఇకనైనా భాష మార్చుకోవాలని.. సీఎంను, మంత్రులను దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. కేసీఆర్​ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, అందుకే బీఆర్​ఎస్​ అడ్రస్​ గల్లంతైందని ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బోనకల్​, ముదిగొండలో నిర్వహించిన రోడ్​షోలో భట్టి మాట్లాడారు. 

ఇప్పటికీ కేసీఆర్​ తీరు మారడం లేదని, పొద్దున లేస్తే కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం తప్ప మరేమీ చేయడం లేదని మండిపడ్డారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టుమని ఒక సీటు కూడా గెలిచేటట్టు లేదని అన్నారు. కారు స్టీరింగ్ ఒకరు, టైర్లు ఒకరు ఊడతీసుకొని వెళ్లిపోయారని, ఇక ఈ రాష్ట్రంలో కారు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 

ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రి ఎలా అవుతాడని భట్టి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నువ్వా? నేనా? అన్నట్టు పోటీ ఉండేదని, ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పార్లమెంట్​ఎన్నికల్లో నిలబడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇంకో పార్టీ అభ్యర్థి ఓట్లు అడిగేందుకు స్థానముందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐతో పాటు కూటమికి తెలుగు తమ్ముళ్లు సైతం మద్దతు ఇస్తున్నారని  చెప్పారు. 

బీజేపీ, బీఆర్ఎస్​ తెలంగాణకు చేసిందేమీలేదు

పదేండ్లుగా దేశాన్ని పాలించిన బీజేపీ, మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ, మోదీ అందరినీ ముంచారని చెప్పారు.  నోరు తెరిస్తే కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్య పెట్టి రాష్ట్ర ప్రజల నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పు మిగిల్చారని, ఇందులో లక్షన్నర కోట్లు కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.  కేసీఆర్​ది రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భట్టి గాడిన పెడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, అందరూ హస్తం గుర్తుపై
ఓటెయ్యాలని కోరారు.  

బీఆర్ఎస్  చేసిన అభివృద్ధి శూన్యం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్​అప్పులపాలు చేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ 140 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిందని చెప్పారు. కారుకు పంక్చర్ అయ్యి గ్యారేజీలో ఉందని, అందుకే చెయ్యి గుర్తుపై ఓటువేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  

ప్రాజెక్టులు పూర్తిచేసి ఖమ్మం రైతుల కాళ్లు కడుగుతాం

ఖమ్మం జిల్లా భూములు సస్యశ్యామలం చేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.1400 కోట్లతో రాజీవ్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలు చేపడితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో రూ.25 వేల కోట్లకు అంచనాలు పెంచిందని భట్టివిక్రమార్క విమర్శించారు. ఇప్పటివరకూ రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసి చుక్క నీరు అందించని దుర్మార్గులు బీఆర్ఎస్ పాలకులు అని ఫైర్​ అయ్యారు. 

రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజీవ్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలు పూర్తిచేసి, ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని పదేండ్లు బీఆర్ఎస్ పాలకుల చేతిలో పెడితే ఏ ఒక్క నెల మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేకపోయారని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమవుతున్నాయని తెలిపారు.

 అంగన్​వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు, హాస్టళ్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులుంటే ఇప్పటివరకూ 65 లక్షల మందికి రైతు భరోసా నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.  అయినా.. రైతుభరోసా అందలేదంటూ బీఆర్ఎస్​ ఇంకా అబద్ధాలు మాట్లాడుతోందని,  మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బండకేసి బాదినా బుద్ధి రాలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేస్తారని తెలిపారు.