అభివృద్ధిలో అగ్రగామిగా ఖమ్మం

అభివృద్ధిలో అగ్రగామిగా ఖమ్మం
  •     ధరణి స్థానంలో అత్యుత్తమ రెవెన్యూ చట్టం
  •     ఖమ్మం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రగతిశీల విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణతో గత 8 నెలల్లో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో  ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో గురువారం జరిగిన 78వ స్వాతంత్య్ర దిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర, జిల్లా ప్రగతి గురించి వివరించారు. 

ఈ  ఏడాదిలోనే 4.50 లక్షల ఇళ్లు

దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. జిల్లాలో మెదటి, రెండు విడతల్లో లక్షన్నర వరకు రుణమున్న మొత్తం 91,799 మంది రైతన్నలకు రూ.520.77 కోట్ల మాఫీ జరిగిందన్నారు. మూడో విడతలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు రూ. 5,689.20 కోట్ల రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 1.58 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద15,307 మంది పేదలకు చికిత్సలు చేసినట్లు తెలిపారు.

ఈ  ఏడాదిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేయబోతున్నట్లు వెల్లడించారు. 3.94 లక్షల మందికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని, జిల్లాలో గృహజ్యోతి వినియోగదారులు 2.36 లక్షల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. 955 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, ఇప్పటివరకు రూ. 12 కోట్లతో 592 పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. 

కొత్త, పాత ఆయకట్టు స్థిరీకరణ

ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భవనాల కోసం అర్బన్ మండల పరిధిలోని బల్లేపల్లి, రఘునాధపాలెం మండల కేంద్రంలో 40 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లాలోని సత్తుపల్లి, పాలేరులలో నర్సింగ్ కాలేజీల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, పైలట్ ప్రాజెక్టు కింద ఈ సంవత్సరం కొడంగల్, మధిరలో ప్రారంభం చేయనున్నామన్నారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఏన్కూర్ వద్ద రూ.77.05 కోట్ల వ్యయంతో 8.69 కి.మీ. మేర రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు, 1,11,818 ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేశామన్నారు. చెక్ డ్యాంలు, ఆనకట్ట బ్యాలెన్స్, మీడియం ఇరిగేషన్ ఆధునికీకరణ, సాగునీటి వనరుల  కాల్వల నిర్వహణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు. వన మహోత్సవం కింద జిల్లాలో 2024లో 31.06 లక్షల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు 25.32 లక్షలు నాటినట్లు తెలిపారు.

ఆర్ధికాభివృద్ధి సాధించాలి

ఖమ్మం పట్టణ ముఖద్వారంలో ఉన్న మున్నేరు నదిపై రూ.180 కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.3 కోట్లతో నేలకొండపల్లిలో భక్తరామదాసు జ్ఞానమందిరం నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నట్టు చెప్పారు. బ్యాంకు లింకేజీ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3,252 గ్రూపులకు రూ.339.83 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. 646 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.16.52 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇచ్చామన్నారు.

ధరణి పోర్టల్​తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని, దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.