- రైతు రుణమాఫీతో మరోసారి రుజువైంది
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇది రైతు రుణమాఫీతో మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నామని తెలిపారు. శనివారం ముదిగొండ మండల పరిధిలోని కమలాపురం నుంచి అయ్యగారిపల్లి వరకు రూ. 2 కోట్లతో, కమలాపురం నుంచి అమ్మపేట వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రూ. 3 కోట్లతో, కమలాపురం ఎస్సీ కాలనీ నుంచి పమ్మి వరకు రూ.2.40 కోట్లతో, కమలాపురం నుంచి జిల్లేడుగడ్డ వరకు రూ.2.25కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం రూ. 21.67 కోట్లతో132/33కేవీ పమ్మి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. అంగన్ వాడీలో 3 వ తరగతి వరకు ఏర్పాటు చేసి 4వ తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు పంపించే పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ డెయిరీ చిరకాల వాంఛని, నియోజకవర్గంలో ని మహిళలను పాడి పరిశ్రమలో వాటాదారులుగా చేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా
చేయడానికి 2014 కు ముందే ఈ డెయిరీని ప్రవేశ పెట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు గేదెలు ఇచ్చి వారిని పరిశ్రమలో వాటాదారులుగా చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ఆర్థికమంత్రి గా బడ్జెట్ ప్రవేశ పెట్టానని, నియోజకవర్గంలో మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.