తావరలోనే వినాయక చవితి పండుగ రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న జరగనున్న వినాయక చవితి కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విగ్రహాలు సిద్ధమయ్యాయి.అయితే, వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్ తో కూడిన పెయింట్ వాడకం పర్యావరణానికి మంచిది కాదని ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ప్రతి ఏటా చెబుతూనే ఉన్నప్పటికీ మార్పు మాత్రం రావట్లేదు.ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి వినాయకుడిని పూజిద్దామంటూ పిలుపునిచ్చారు.
వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలనే పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో మట్టి వినాయకుడికే పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు పవన్.మన వేడుకలు, ఉత్సవాల్లో పర్యావరణహిత వస్తువులను వాడటం మేలని అన్నారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్‌తో చేసిన కవర్లలో ఇవ్వడం సరికాదని, ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలని అన్నారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచే మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్.