![దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం: చంద్రబాబు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!](https://static.v6velugu.com/uploads/2025/02/deputy-cm-pawan-kalyan-is-staying-away-from-official-functions_kZbBEJSCim.jpg)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తమదైన దూకుడు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. వరుస సమావేశాలు, రివ్యూలు, పర్యటనలతో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి నాటి నుంచి పవన్ కల్యాణ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.
పేషీల్లో కూర్చొని కేవలం రివ్యూలకే పరిమితం కాకుండా డైరెక్ట్‌గా ఆయనే గ్రౌండ్ లెవల్లోకి దిగుతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ కాకినాడ ఆకస్మిక పర్యటన ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనలోని ‘సీజ్ ది షిప్’ డైలాగ్ వైరల్ అయ్యింది. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ కేవలం ఆరు నెలల్లోనే పాలనలో పవన్ కల్యాణ్ తన మార్క్ చూపించారు.
Also Read :- స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా.. పార్టీల రియాక్షన్ ఇదే
అయితే.. ఎన్డీఏ కూటమిలో హైపర్ యాక్టివ్‌గా ఉన్న జనసేనాని.. ఒక్కసారిగా సెలైంట్ అయిపోయినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకు కూడా పవన్ అంటిముట్టనట్టుగానే ఉంటున్నారట. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మీటింగ్‌లకు కూడా డిప్యూటీ సీఎం డుమ్మా కొడుతున్నారంట. చివరకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్ స్పందించడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అధికారిక కార్యక్రమాలకు పవన్ దూరం.. ?
ఇటీవల జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ యాక్టివ్‌గా ఉన్నారు. రెండు రోజుల పాటు సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలు కూడా వివరించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే మంగళవారం (ఫిబ్రవరి 11) సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో మాత్రం పాల్గొనలేదు. అంత కీలక సమావేశానికి పవన్ సామాన్యంగా హాజరు కాకుండా ఉండరు. పాలనపై పట్టు సాధించుకోవడానికి అలాంటివి బాగా ఉపయోగపడతాయి. కానీ ఆయన గైర్హాజరయ్యారు.
చంద్రబాబు ఫోన్‌కు అందుబాటులోకి రాని పవన్..?
మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడంతో చంద్రబాబు నాదెండ్ల మనోహర్‌ను అడిగారట. పవన్ తీవ్రమైన నడుంనొప్పితో బాధపడుతున్నారని.. అందుకే రాలేదని నాదెండ్ల ఆన్సర్ ఇచ్చారట. చంద్రబాబు కూడా తాను పవన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నం చేశానని.. అయినా అందుబాటులోకి రాలేదని చెప్పారట. ఇది చాలా మంది ఆశ్యర్యపోయారు. సీఎం సంప్రదించినా అందుబాటులోకి రాకపోవడం అంటే.. చిన్న విషయం కాదని.. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అంటూ చర్చలు ఊపందుకున్నాయి.
నెల రోజులుగా అధికార కార్యక్రమాలకూ దూరం..!
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ అని.. అందుకే కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కావడం లేదని జనసేన పార్టీ ఇటీవల ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. పవన్ కల్యాణ్ కుర్చీ ఖాళీగా ఉన్న కేబినెట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అధికారం చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు పవన్ తీరిక లేకుండా ఉన్నారు. విస్తృతంగా పర్యటనలు చేశారు. సమావేశాలు నిర్వహించారు. తన శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే హఠాత్తుగా ఆయన అధికారిక కార్యక్రమాల నుంచి కనిపించకుండా పోయారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికీ ఆయన వెళ్లకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
కేరళకు వెళ్లిన పవన్
అనారోగ్యం, తీరిక లేని షెడ్యూల్ వల్ల పవన్ కల్యాణ్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు అధ్కక్షతన జరిగిన కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదని చెప్పారు. అయితే.. కేబినెట్ భేటీ ముగిసిన మరుసటి రోజే పవన్ కల్యాణ్ నాలుగు రోజుల పాటు అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు.
ఈ మేరకు బుధవారం కొచ్చి ఎయిర్ పోర్టులో ఆయన నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని జన సేనికులు చెబుతుండగా.. మీటింగ్ ముగిసి 24 గంటలు కూడా కాకముందే పవన్ కల్యాణ్ తీర్థయాత్రలకు వెళ్లడం కొత్త చర్చకు తెరలేపింది. ఆరోగ్యం బాగోలేకపోతే నాలుగు రోజుల పాటు తీర్థయాత్రలకు ఎలా వెళ్తారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో పవన్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి అనారోగ్యం కారణం కాదని.. దీని వెనుక ఇంకేదో రీజన్ ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి నుంచే.. అధికారిక కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ అంటిముట్టనట్లుగా ఉంటున్నారని సైతం ప్రచారం ఉంది. మరీ పవన్ కల్యాణ్ అలకకు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది.