ఏపీలో పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోమవారం ( అక్టోబర్ 14, 2024 ) కంకిపాడులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం అని.. అందుకే కలిసి పోటీ చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించాలిని, టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం వల్ల ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు పవన్.
ప్రభుత్వ పనితీరు పారదర్శకంగాఉండాలని, తమతో పాటు అధికారులు కూడా నిజాయితీగా ఉండాలని అన్నారు. లంచం తీసుకున్న అధికారిపై వెంటనే చర్యలకు ఆదేశించామని అన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు లాంటి నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పు చేసినవారం అవుతామని అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలీదని అన్నారు. గ్రామ సభలు కూడా పెట్టలేదని.. నిర్ణయాలు ఎవరు తీసుకున్నారో తెలీదని అన్నారు పవన్. డబ్బులు ఎలా ఖర్చయ్యాయో కూడా ఎవరికీ తెలీదని అన్నారు. గత పాలకులు తిట్ల పురాణాలు, శాపనార్దాలు తప్ప చేసిందేమీ లేదని అన్నారు పవన్ కళ్యాణ్. 151మందిని గెలిపిస్తే ఏ ఎమ్మెల్యే కూడా సమస్యల గురించి మాట్లాడలేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.