
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు కొనసాగుతుందని.. ఈ 15 ఏళ్లు అధికారంలోనే ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2025, ఫిబ్రవరి 25వ తేదీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన. బయట ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని.. నన్ను, సీఎం చంద్రబాబు, లోకేష్ గురించి ఏదేదో మోట్లాడుతున్నారని.. వీటిని పట్టించుకోం అన్నారు. కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటున్నా.. ఏపీ ప్రజల కోసం కలిసే ఉంటామన్నారు పవన్ కల్యాణ్.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. కింద పడినా.. పైకి లేచినా.. కూటమి మాత్రం విడిపోదు అన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదని.. అర్హత లేని వైసీపీకి ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తామని ప్రశ్నించారాయన. ప్రతిపక్ష హోదానే కావాలంటే జర్మనీ వెళ్లాలని.. కావాలంటే డబ్బులు వేసుకుని ఫ్లయిట్ టికెట్లు బుక్ చేస్తామంటూ సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్.
అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర మేమే పోషిస్తామని.. అధికార పార్టీనే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గవర్నర్ ప్రసంగాన్ని అవమానించిన వైసీపీని మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఇవ్వమని.. మళ్లీ వాళ్లకు అధికారం ఇచ్చేది లేదని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రానివ్వం అని.. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కూటమి కలిసే ఉంటుందని.. ఇది కుటుంబం అన్నారు పవన్ కల్యాణ్.