
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. గౌరవ వేతనం రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా వలంటీర్ల కొనసాగింపు ఎలాంటి ఊసు లేకపోగా.. సీఎం చంద్రబాబు సహా మంత్రి లోకేష్ వంటి కీలక నేతలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో పలు మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు వాలంటీర్లు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పామని.. కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు ఎలాంటి జీవో లేదని అన్నారు. మంగళవారం ( ఏప్రిల్ 8 ) అల్లూరి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాలంటీర్ వ్యవస్థను నడిపారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా ఎలాంటి దాఖలాలు లేవని అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొద్దామంటే అధికారికంగా ఎలాంటి ఆప్షన్ లేకుండా చేశారని అన్నారు పవన్ కళ్యాణ్.
Also Raed : పవన్ కల్యాణ్ చిన్న కుమారుడుకు ప్రమాదం
కాగా.. పవన్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉండగా.. సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పావనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన విశాఖ ఎయిర్పోర్ట్ నుండి సింగపూర్ బయలుదేరారు పవన్. మంగళవారం ( ఏప్రిల్ 8 ) పావనోవిచ్ చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ కారణంగా పావనోవిచ్ కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చినట్లు సమాచారం.