పవన్ కళ్యాణ్ అనే నేను.. మరోసారి ప్రమాణం చేసిన డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ప్రమాణం చేశారు. ఉప్పాడలో పర్యటిస్తున్న పవన్ వారాహి బహిరంగసభలో ఎమ్మెల్యేగా ప్రజల ముందు ప్రమాణం చేశారు. ఉప్పాడ తీరప్రాంతంలో పర్యటించిన పవన్ సముద్రపుకోత గురైన ప్రాంతంపై అధికారులతో చర్చించారు. అనంతరం వారాహి బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు అఖండ విజయం అందించారని, పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని అన్నారు.

వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అన్నారని, గేటు తాకడం కాదు కదా బద్దలు కొట్టుకొని వెళ్లామని అన్నారు పవన్. ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధించామని, గొప్ప విజయానికి పిఠాపురం నుండే భీజం పడిందని అన్నారు. 100శాతం స్ట్రైక్ రేట్ సాధించటం మాములు విషయం కాదని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండరని వైసీపీ నేతలు విమర్శించారని, ఇప్పుడు పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నానని స్పష్ఠం చేశారు.

151స్థానాలున్న అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని 11స్థానాలకు పరిమితం చేసి ప్రజాస్వామ్య శక్తిని చూపించారని అన్నారు. ఆడపడుచులు, యువత తమ కోపాన్ని ఓట్ల రూపంలో మళ్లించి కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. అధికారులతో పార్టీ నేతలు మర్యాదగా వ్యవహరించాలని, క్రమశిక్షణ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు అనుభవం సమర్థత వల్లే వాలంటీర్ల సహాయం లేకుండా ఒక్కరోజులోనే 902శాతం పెన్షన్ల పంపిణీ చేశామని అన్నారు.