సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయాన్ని సందర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకునే సమయంలో రైతులు, జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించిన పవన్ ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కు వై+ క్యాటగిరి భద్రతను కేటాయించింది ప్రభుత్వం.