తగ్గేదే లే..తమిళనాడులో మరో భాషా యుద్ధానికి మేం సిద్ధం: ఉదయనిధి స్టాలిన్

తగ్గేదే లే..తమిళనాడులో మరో భాషా యుద్ధానికి మేం సిద్ధం: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడులో మరో భాషా యుద్ధం తప్పదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కేంద్రానికి భయపడటానికి ఇక్కడ ఉన్నది అన్నా డీఎంకే కాదని,  DMK అధికారంలో ఉందన్న సంగతి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కొత్త విద్యా విధానం పేరుతో తమిళులపై హిందీని రుద్దాలని చూస్తున్నారని, దీనికి తగ్గే పరిస్థితి లేదని అన్నారు.

హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో స్థానిక భాషలను హిందీ మింగేసిందని, తమిళనాడును అలా కానివ్వమని అన్నారు. NEP (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) ని అంగీకరిస్తే 5 వేల కోట్ల రూపాయల సాయం ఇస్తామని అంటున్నారని, ఆల్ రెడీ  NEP  ద్వారా 6 వేల కోట్లతో హిందీని రుద్దాలని చూస్తున్నారని అన్నారు. 

‘‘మేము NEP ని అంగీకరించం, డీలిమిటేషన్ ను ఒప్పుకోం, హిందీ రుద్దడాన్ని ఒప్పుకోం. మా ముఖ్యమంత్రి చెప్పిన మూడు నిర్ణయాలు ఇవే..’’నని అన్నారు.  

నూతన విద్యా విధానం ద్వార తమిళనాడులో హిందీని రుద్దాలని చూస్తున్నారని గత కొంత కాలంగా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రాను రాను ఈ ఇష్యూ పెద్దదిగా మారుతోంది. రాజకీయ నాయకుల నుంచి ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఇప్పటికే హిందీలో ఉన్న బోర్డులను నల్ల రంగుతో తుడిచి వేస్తున్నారు తమిళులు. అదే విధంగా ఆడపడుచులు ఇంటి ముందర వేసే ముగ్గులలో ‘‘మేము హిందీని ఒప్పుకోం’’ అని ముగ్గులు వేయడం చర్చనీయాంశం అయ్యింది. 

అయితే తమిళనాడు బీజేపీ నేతలుమాత్రం హిందీ మూడవ భాషగా నేర్చుకోవడం వలన అవకాశాలు పెరుగుతాయని, వేరే రాష్ట్రాలకు వెళ్లినపుడు కమ్యూనికేషన్ కు ఉపయోగపడుతుందని, విద్యా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. చూడాలి మరి.. ఈ వివాదంలో ఎవరు తగ్గుతారో.. ఎవరు నెగ్గుతారో.