- మంత్రి పొంగులేటికి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ కోరారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి గ్రామ స్థాయిలో అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించాలన్నారు. మంగళవారం వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు.
ఇటీవల 9 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదా చాలా బాగుందని మంత్రికి తెలిపారు. ఈ చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న వాహనాల బిల్లులను త్వరగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కూడా కొత్త ఆర్వోఆర్ చట్టం ముసాయిదాకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించినందుకు సంఘం నేతలను అభినందించారు.