హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితి కెప్టెన్ లేని ఓడలా తయారైందని, తుఫాన్ లో చిక్కుకుని ఎక్కడికి వెళుతుందో వారికే అర్థం కాట్లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నాయకుడు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. సభను మిస్ గైడ్ చేస్తూ ఒకే అంశాన్ని పట్టుకొని ఇష్యూ చేస్తున్నారన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో భట్టి మీడియాతో చిట్ చాట్ చేశారు. భూమి లేని కూలీలకు ఆర్థిక సాయం చేస్తామంటే బీఆర్ఎస్ వద్దంటున్నదని, రైతులకు మేలు జరగటం వారికి ఇష్టం లేదని చెప్పారు.
కావాలనే డిస్టర్బ్ చేస్తున్నది: మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలను చర్చించేందుకు మేం రెడీగా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ నిర్ణయిస్తారని వెల్లడించారు. సభను కావాలనే బీఆర్ఎస్ డిస్టర్బ్ చేస్తుందన్నారు.
కేటీఆర్ జైలుకెళ్లక తప్పదు: మంత్రి వెంకటరెడ్డి
ఫార్ములా ఈ రేస్ అంశంలో కేటీఆర్ చేసింది పెద్ద తప్పని, ఆయన జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో ఏడేండ్ల వరకు శిక్ష పడే చాన్స్ ఉందన్నారు.