
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్‌ను దృష్టిలో పెట్టుకొని ఫెస్టివల్‌కు సంబంధించిన బజార్లకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికారులకు సూచించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై తన క్యాంపు ఆఫీస్‌లో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి సికింద్రాబాద్ నియోజకవర్గ మసీదుల మతపెద్దలు, అధికారుల, పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీ విభాగం అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
మసీదుల పరిసర ప్రాంతాల్లో నిరంతరం శుభ్రం చేయాలని, అలాగే అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు, డైలీ సాయంత్రం ఇఫ్తార్ తరువాత వ్యర్థాల తొలగించాలన్నారు. ఎంటమాలజీ విభాగం ద్వారా ఫాగింగ్, వీధుల్లో తిరిగే కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు.