శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరి

శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరి

మహారాష్ట్రలో క్షణానికో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహా వికాస్​ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండేకు ఎమ్మెల్యేల బలం క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్ చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆమోదించారు. ఈ మేరకు ఓ లేఖను శివసేన కార్యాలయ కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ కార్యాలయం పంపింది. రెబల్ ఏక్ నాథ్ షిండే స్థానంలో ఆయన ఉండనున్నారు. తనకు 38 మంది శివసేన ఎమ్మెల్యేల బలం ఉందని షిండే వెల్లడిస్తున్నారు. గౌహతిలోని ఓ హోటల్ లో షిండేతో పాటు ఉన్న ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటో వైరల్ అవుతోంది. 

మరోవైపు...ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు ఏక్ నాథ్ షిండే. ఎమ్మెల్యేల మద్దతు లేని ఉద్దవ్ ఎలా కంప్లైంట్ చేస్తారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ చట్టవ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు షిండే. తనకు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని చెప్తున్నారు ఏక్ నాథ్. అసలు ఎమ్మెల్యేలను సస్పెండ్  చేసే రైట్ కూడా లేదన్నారు. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్  థాక్రే పార్టీ  జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. శిండే వర్గం ఇప్పటికే 400 మాజీ కార్పొరేటర్లతో భేటీ అయ్యింది. దీంతో జిల్లాల నేతలతో మాట్లాడాలని ఉద్దవ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే పార్టీ ఎంపీలు కూడా ఉద్ధవ్  నుంచి చేజారవచ్చనే టాక్ వినిపిస్తోంది.